వైకాపాలో ఎంపీ టికెట్లను అడిగే వారు లేక ఈగలు తోలుకుంటున్నారని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. ఎమ్మెల్యేలు తమ స్థానం నుంచి మారకపోతే వారికి బలవంతంగా పార్టీ నాయకత్వం ఎంపీ టికెట్ కట్టబెడుతోందన్నారు. గతంలో వైకాపా ఎంపీ టికెట్ కావాలి అంటే 140 కోట్ల రూపాయలు అడిగారన్న వాదనలు వినిపించాయని, ఇప్పటికే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు గారు టీడీపీలో చేరారని, ఒక్కరు కూడా వైకాపాలో ఎంపీ సీటు అడగడం లేదని అన్నారు.
ఎందుకు అడగడం లేదంటే వైకాపా ఓడిపోవడం ఖాయమని అందరికీ తెలిసి పోయిందన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వద్దని చెబుతున్న వినకుండా ఆయనకు ఒంగోలు ఎంపీ టికెట్ కట్టబెట్టారని, ఎక్కడ చిత్తూరు, ఎక్కడ ఒంగోలన్న రఘురామకృష్ణ రాజు గారు, నెల్లూరు టికెట్ ను కూడా విశాఖపట్నంపై అవిభాజ్యమైన ప్రేమను పెంచుకున్న విజయసాయి రెడ్డి గారికి ఇచ్చారని అన్నారు. నేను పుట్టింది నెల్లూరులోనే అయినా, నా మట్టి విశాఖపట్నంలో కలవాల్సిందేనన్న విజయసాయి రెడ్డి గారికి విశాఖపట్నం అంటే అంత పిచ్చి అని ఎద్దేవా చేశారు. ఇంకా నాలుగేళ్లు రాజ్యసభ పదవీకాలం ఉన్నప్పటికీ, నెల్లూరు ఎంపీగా ఆయన్ని పోటీ చేయించడం పరిశీలిస్తే, వైకాపా నాయకత్వానికి అభ్యర్థులు దొరకడం లేదన్న విషయం అర్థమవుతుందని అన్నారు.