రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీల మధ్య నూటికి నూరుపాళ్లు పొత్తు ఉంటుందని రఘురామకృష్ణ రాజు అన్నారు. ఇప్పటికే తెలుగుదేశం, జనసేన శ్రేణులు క్షేత్రస్థాయిలో కలిసిపోయాయని, గత రెండేళ్లుగా రెండు పార్టీల కార్యకర్తల మధ్య మంచి సమన్వయం కనిపిస్తోందని, ఉభయగోదావరి జిల్లాలోని 34 స్థానాలలో ఒక్క స్థానం కూడా అధికార పార్టీకి రావద్దన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మాటల్లో ఎటువంటి దోషం లేదని వెల్లడించారు.
అలాగే 175 కు 175 స్థానాలు తమకే రావాలన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యల్లోనూ తప్పులేదని, రేపు ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే నరసాపురం స్థానం ఏ పార్టీ తీసుకుంటే, ఆ పార్టీ తరఫున తాను పోటీ చేస్తానని అన్నారు. కూటమిలోని అన్ని పార్టీల జెండాలను ప్రచారంలో భాగంగా పట్టుకొని ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహిస్తానని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. ముఖ్యమంత్రిగా అవకాశం వస్తే కాదననని పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని, మంత్రులు పెద్దిరెడ్డి, సత్తిబాబు గార్లకు ముఖ్యమంత్రిగా అవకాశం వస్తే వద్దంటారా? అని ప్రశ్నించారు.
తమ పార్టీ వారి వాదనలు కోడిగుడ్డుపై ఈకలు పీకినట్టుగా ఉన్నాయని రఘురామకృష్ణ రాజు గారు విమర్శించారు. ప్రజల ఆకాంక్షల మేరకు తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు ఖచ్చితంగా ఉంటుందని ఆయన కుండబద్దలు కొట్టారు. పవన్ కళ్యాణ్ గారిని తమ పార్టీ కాపు నేతలు, మంత్రులు, మాజీ మంత్రులు పరుష పదజాలంతో దూషించినప్పుడు ముద్రగడ పద్మనాభం గారు లేఖ రాసి ఉంటే బాగుండేదని, అలాగే తనను అపహరించి లాకప్ లో చిత్రహింసలకు గురి చేసినప్పుడు, వీడియో చూసి జగన్ మోహన్ రెడ్డి గారు ఆనందించినప్పుడు కూడా పద్మనాభం గారు లేఖ రాసి ఉంటే మరింత బాగుండేదని, పవన్ కళ్యాణ్ గారిని కాపు నేతల చేత తిట్టించినప్పుడు లేఖ రాయని ముద్రగడ పద్మనాభం గారు ఇప్పుడు లేఖ రాయడం ఎంత వరకు సమంజసం అని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు.