ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం రోజున అమెరికా చేరుకున్న మోదీ.. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌తో మంగళవారం (అమెరికా కాలమానం ప్రకారం) సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్‌లో పెట్టుబడులు పెట్టమని ఎలాన్ మస్క్‌ను ప్రధాని మోదీ కోరారు.
దీనిపై స్పందించిన ఎలాన్ మస్క్.. తాను ప్రధాని మోదీ అభిమానినని అన్నారు. మోదీని కలవడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. ఆయన కొత్త కంపెనీలకు అండగా నిలుస్తారని మోదీపై మస్క్ ప్రశంసల వర్షం కురిపించారు. వచ్చే ఏడాది భారత్‌లో పర్యటించేందుకు ప్లాన్ చేస్తున్నానని తెలిపారు.
“భారత్‌లో పెట్టుబడులు పెట్టేవారిని ప్రధాని మోదీ ప్రోత్సహిస్తున్నారు. ట్విటర్ స్థానిక ప్రభుత్వాలు పెట్టే నిబంధనలు అనుసరించడం తప్ప వేరే మార్గం లేదు. లేదంటే సంస్థను మూసివేయాలి. ఏ దేశంలోనైనా ఆ దేశ చట్టాలకు అనుగుణంగానే ట్విట్టర్‌ను నడపాలి. టెస్లా కంపెనీని భారత్‌లో పెట్టే అవకాశం ఉంది. వీలైనంత త్వరగా ఆ దిశగా చర్యలు సాగిస్తాం. ప్రధాని మోదీకి భారత్ పట్ల చాలా నిబద్ధత ఉంది. భారత్‌లో పెట్టుబడులు పెట్టమని నన్ను ఆహ్వానించారు. ప్రధానితో చర్చలు అద్భుతంగా జరిగాయి”
– ఎలాన్ మస్క్, టెస్లా సీఈఓ