టీడీపీ నేత బీటెక్ రవీంద్రనాథ్ రెడ్డి గారిని అరెస్టు చేసి, పులివెందులలో భయానక వాతావరణం సృష్టించాలని పాలకులు భావించినట్లు స్పష్టం అవుతోందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. దీన్నిబట్టి చూస్తే పులివెందులలో కూడా నెగ్గగలమా అనే అనుమానం వై నాట్ 175 అని చెప్పుకు తిరిగే పాలకుల్లో కనిపిస్తోందన్నారు. జైలులో లేదా కోర్టుకు తరలించే సమయంలో బీటెక్ రవీంద్రనాథ్ రెడ్డి గారికి ఏమైనా హాని జరిగితే, దానికి పులివెందుల ఎమ్మెల్యే, ప్రస్తుత ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారు పూర్తి బాధ్యతవహించాల్సి ఉంటుందని తమ పార్టీ తరఫున, ప్రజల తరఫున హెచ్చరిస్తున్నానని తెలిపారు.
ఈ ఏడాది జనవరి మాసంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి కడప జిల్లా పర్యటన సందర్భంగా ఒక ఏ ఎస్ ఐ కి వాహనం టైరు రాసుకు పోయిందని, ఈ ప్రమాదంలో ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదని గుర్తు చేశారు. అయినా బీటెక్ రవీంద్రనాథ్ రెడ్డి గారిపై ఐపిసి 324 సెక్షన్ కింద కేసు నమోదు చేశారని, ఐపిసి 324 సెక్షన్ కింద నిందితుడిగా తేలితే మూడేళ్ల జైలు శిక్ష పడుతుందని, ఈ కేసులో కోర్టు ద్వారా బెయిల్ పొందవచ్చునని, ఎలాగైనా బీటెక్ రవి గారిపై పదేళ్ల శిక్షార్హమైన కేసును నమోదు చేయాలని భావించిన పోలీసులు సెక్షన్ మార్చి ఐపిసి 333 కింద కేసు నమోదు చేశారని తెలిపారు.