మరో 14 రోజుల్లో తెలంగాణలో శాసనసభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత మూడ్రోజులకే తెలంగాణ ప్రజలు ఎవరికి పట్టం కట్టారో తెలిసిపోతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చిన అధికారులు భద్రతా ఏర్పాట్లపైనా ఫోకస్ చేస్తున్నారు. ఇంకోవైపు ఓటర్ స్లిప్పుల పంపిణీ ప్రారంభించారు.
అయితే పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎన్నికల అధికారులు మార్గనిర్దేశం చేశారు. పోలింగ్ కేంద్రాలకు ఎట్టిపరిస్థితుల్లో సెల్ఫోన్ తీసుకువెళ్లకూడదని స్పష్టం చేశారు. అధికారుల కన్నుగప్పి తీసుకెళ్లినా.. ఓటు వేసే సమయంలో సెల్ఫీ దిగడం వంటి చర్యలకు పాల్పడినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ముఖ్యంగా వేసిన ఓటును ఫొటో తీసి ఇతరులకు చూపించడం, పంపించడం వంటివి చేస్తే వారి ఓటును రద్దు చేసి కేసు నమోదు చేయనున్నట్లు చెప్పారు. అంతే కాకుండా.. పోలింగ్ అధికారి ఆ ఓటరు ఓటును 17-ఏలో నమోదు చేస్తారు దాంతో లెక్కింపు సమయంలో ఆ ఓటును పరిగణనలోకి తీసుకోరు. అంటే.. ఆ ఓటు రద్దు అయినట్లే ఇక.