జగన్ మోహన్ రెడ్డి బయోపిక్ గా రూపొందించిన యాత్ర 2 సినిమా టికెట్లను ఉచితంగా ఇచ్చి, కూల్ డ్రింక్స్ కొనిపెట్టినా థియేటర్లలో జనమే కనిపించడం లేదని రఘురామకృష్ణ రాజు తెలిపారు. యాత్ర సినిమా దివంగత ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డి బయోపిక్ కావడంతో, చనిపోయిన మంచి వ్యక్తి అని … ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరించారని, దానితో పెట్టిన పెట్టుబడి రికవరీ అయిందని, జగన్ మోహన్ రెడ్డి గారి బయోపిక్ లో పొడుగ్గా ఉన్న వ్యక్తి చేత ఆయన క్యారెక్టర్ వేయించినప్పటికీ, కళ్ళ ఎదురుగా జరిగిన సంఘటనలను వక్రీకరించడం వల్ల ప్రేక్షకాదరణకు నోచుకోవడం లేదన్నారు. సినిమాను చూడడానికి థియేటర్ కు ఒక్కరూ కూడా రావడంలేదని చెప్పారు.
తిరుపతిలోని ఒక థియేటర్లో కేవలం ఒకే ఒక టికెట్ తెగినట్లు తనకు పరిచయం ఉన్న డిస్ట్రిబ్యూటర్ చెప్పారని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. కనీసం జగన్ మోహన్ రెడ్డి గారు చెబుతున్నట్లుగా 175 స్థానాలకు గాను 175 సీట్లు కూడా యాత్ర 2 సినిమా కోసం థియేటర్లలో నిండడం లేదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలు టికెట్లు కొని ప్రేక్షకులకు ఉచితంగా అందజేసి, కూల్ డ్రింక్స్ కొనుగోలు కోసం వంద రూపాయలు కవర్లో పెట్టి ఇస్తున్నప్పటికీ, థియేటర్లలోకి జనం వెళ్లడం లేదన్నారు. చివరకు, సినిమా మొత్తం చూస్తే 500 రూపాయల ప్యాకేజీ ప్రకటించినా థియేటర్లోకి వెళ్లేవారే ఉండరన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారి భక్తులు సినిమా తిలకించడానికి తెగ వచ్చేస్తారనుకుంటే, సినిమా హాళ్లలో సింగల్ పర్సన్ లేకపోవడం వల్ల మ్యాట్నీ షోలను రద్దు చేసినట్లు తెలిసిందన్నారు.