తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో ఇవాళ 2024-25 ఏడాదికి గానూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2.75 లక్ష కోట్లతో పద్దును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా వ్యవసాయ శాఖకు రూ.19.746 కోట్లు కేటాయించారు. ఈ నేపథ్యంలో రైతుల సంక్షేమం గురించి భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కార్యక్రమాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని పటిష్ఠంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
ఇందుకోసం పశ్చిమ బెంగాల్‌లో అమలవుతున్న తీరును పరిశీలిస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. అది అధ్యయనం చేసిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. రైతు బీమా పథకాన్ని కౌలు రైతులకు కూడా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అందుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందిస్తున్నామని చెప్పారు. విత్తన భాండాగారంగా ఉన్న తెలంగాణ ఇంకా ఎంతో ప్రగతిని సాధించడానికి అవకాశం ఉండీ సాధించలేకపోయిందని, అందుకే నకిలీ విత్తనాలను అరికట్టేందుకు తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.