నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయండని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు పేర్కొన్నారు. ఆర్థిక నేరాభియోగల కేసులలో 43 వేల కోట్ల రూపాయలు కొట్టేశారని సీబీఐ 11 చార్జిషీట్లు దాఖలు చేయగా, కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి అర్హుడు కానీ, సీబీఐ, సీఐడీ కేసు విచారణ జరుగుతోందని చెప్పి న్యాయస్థానంలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేయడానికి నేను అనర్హుడనని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు మండిపడ్డారు.
వైకాపా ఎంపీనని చెప్పి తాను తప్పుడు ధృవీకరణ ఇచ్చానని అడ్వకేట్ జనరల్ గారు పేర్కొనడం ఆశ్చర్యాన్ని కలిగించిందని, తనను ఇంకా పార్టీ నుంచి బహిష్కరించలేదన్న విషయాన్ని అడ్వకేట్ జనరల్ గారు గుర్తించాలని రఘురామకృష్ణ రాజు గారు సూచించారు. ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి గారికి చెప్పి తనను పార్టీ నుంచి బహిష్కరించమని సలహా ఇవ్వాలంటూ ఆయన అడ్వకేట్ జనరల్ గారికి చెప్పారు.
అప్పుడు తాను వైకాపా ఎంపీని కాదని, సాధారణ ఎంపీనని గుర్తించాలని పేర్కొంటూ ధ్రువీకరణ పత్రాన్ని మార్చి, కోర్టుకు సమర్పిస్తానన్నారు. మూడున్నర ఏళ్ల క్రితం షెడ్యూల్ 10 ప్రకారం తనపై వైకాపా నాయకత్వం అనర్హత పిటిషన్ దాఖలు చేసిందని, ఆ పిటిషన్ కు తాను అప్పుడే సమాధానం చెప్పానని, గతంలో సీనియర్ పార్లమెంటేరియన్ శరద్ యాదవ్ గారిని అనర్హుడిగా ప్రకటించినట్లుగా, తనను కూడా అనర్హుడిగా ప్రకటించారని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు అనుకుంటున్నారేమోనని ఎద్దేవా చేశారు.