రఘురామ కృష్టంరాజు చెప్పిన కట్టప్ప ఎవరు?అధికార వైసీపీలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు రోజులు గడుస్తున్నా కొద్దీ కొరకరాని కొయ్యగా మారుతున్నారు. ఆయన దూకుడుకి కేంద్రం కూడా సపోర్ట్ గా నిలవడంతో రఘురామ స్పీడుకి స్పీడు బ్రకేర్లే లేకుండా పోయాయి. గత కొన్ని నెలలుగా సొంత పార్టీపైనే అసమ్మతి రాగం వినిపిస్తున్న రఘురామ తాజాగా తన విమర్శలకు మరింత పదును పెట్టారు. కొంత మందిని టార్గెట్ చేస్తూ సెటైర్లు వేయడం మొదలుపెట్టారు.
ఏపీలో ఆవ భూముల వ్యవహారంపై కోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై రఘురామ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆవ భూముల కేసులో కట్టప్ప తప్పించుకోలేడంటూ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఏపీలో పేదల ఇళ్ల స్థలాల ముసుగులో కుంభ కోణానికి పాల్పడిన వారికి శిక్షపడటం ఖాయం. `బాహుబలి` రెండు సినిమాల్లో కట్టప్ప తప్పుచేసినా తప్పించుకోగలిగాడని, అయితే ఈ కట్టప్ప మాత్రం తప్పించుకోలేడని రఘురామ కృష్ణంరాజు తీవ్ర స్థాయిలో హెచ్చిరంచారు.
న్యూ ఢిల్లీలో జరిగిన విలేకర్ల సమావేశంలో రఘురామ కృష్టంరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆవ భూముల వ్యవహారాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని, ఈ విషయంలో హైకోర్టు సూచనలని స్వాగతిస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఆవ భూముల వ్యవహారంపై ఎవరు బాధ్యత తీసుకుంటారని ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిలదీయడం ఆసక్తికరంగా మారింది. ఇదిలా వుంటే ఇంతకీ రఘురామ చెబుతున్న కట్టప్ప ఎవరనే చర్చ మొదలైంది.