నాణ్యత లేని మద్యాన్ని సేవించి ఎంతో మంది మద్యపాన ప్రియులు ప్రాణాలను కోల్పోతున్నారని, ఈ మద్యం చావులన్నీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు వాయిస్తున్న మరణం మృదంగమేనని, మగవారి దగ్గర సొమ్ములు కొట్టేసి, మహిళలను విధవలు చేస్తున్న దుర్మార్గమైన పాలకులను క్షమిద్దామా? అని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు. ఒక్క ఛాన్స్ అంటూ బ్రతిమాలితే అవకాశం ఇచ్చిన మనము కోరుకున్నది మహిళల వైధవ్యమేనా? అంటూ నిలదీశారు.
ANDHRA PRADESH రాష్ట్రంలోని నాణ్యత లేని మద్యంపై ఉద్యమించేందుకు మహిళలు ఇప్పటికైనా మేల్కొనడం హర్షించదగ్గ పరిణామని పేర్కొన్నారు. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరమే అని, అయినా మీ భర్తలు మీ మాట వినకుండా మద్యం తాగాలనుకుంటే మరో ఆరు నెలలు ఆగమని చెప్పండని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తారని, నాణ్యమైన మద్యం సేవించిన వారు 30 ఏళ్ల తర్వాత శరీరంలోని అవయవాలు చెడిపోయి చనిపోతే, జగన్ మోహన్ రెడ్డి గారి నాసిరకమైన మద్యాన్ని తాగితే ఏడాదికే అవయవాలన్నీ చెడిపోయి టపా కట్టేస్తారని అన్నారు.