చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు, చైతన్యం నేటితరానికి స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తన హక్కుల కోసం కోర్టుల్లో పోరాడిన ప్రజాస్వామికవాది.. ఐలమ్మ అని గుర్తు చేశారు. నేడు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె సేవలను.. పోరాటస్ఫూర్తిని స్మరించుకున్నారు. ఐలమ్మ స్ఫూర్తి.. రాష్ట్ర సాధన, ప్రగతి ప్రస్థానంలో ఇమిడి ఉందని తెలిపారు.
ఐలమ్మ జయంతి, వర్థంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు. రజకుల సంక్షేమానికి తమ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని చెప్పారు. బీసీ, ఎంబీసీల అభివృద్ధికి అమలు చేస్తున్న పథకాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని వెల్లడించారు. సబ్బండ కులాల జీవన ప్రమాణాలను రాష్ట్ర ప్రభుత్వం గుణాత్మకంగా అభివృద్ధి పరుస్తోందని, బీసీ, ఎంబీసీ మహిళల సంక్షేమం కోసం తమ కృషి కొనసాగుతూనే ఉంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా చాకలి ఐలమ్మ జయంతి నిర్వహిస్తున్నారు. పలు జిల్లాల్లో ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ మంత్రులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఐలమ్మ పోరాట స్ఫూర్తిని తలుచుకుంటున్నారు. నేటి తరానికి ఐలమ్మ జీవితం గురించి తెలియాల్సిన అవసరం ఉందని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు.