వై.యస్. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విచారణలో భాగంగా కడప ఎంపీ వై.యస్. అవినాష్ రెడ్డి గారికి సీబీఐ సోమవారం మరొకసారి నోటీసులు జారీ చేసి ఆయనను అరెస్టు చేయడం ఖాయమని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. హైకోర్టు ఆర్డర్ తీర్పు కాపీ అందగానే సుప్రీంకోర్టును వై.యస్. అవినాష్ రెడ్డి గారు ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా?, లేకపోతే వ్యక్తిగతంగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా అన్నది తెలియాల్సి ఉందని అన్నారు. అలవాటులో పొరపాటుగా రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ప్రభుత్వ ప్రతినిధి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారేమోనని ఆయన అపహాస్యం చేశారు.
శుక్రవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణ రాజు గారు మీడియాతో మాట్లాడుతూ… ఇలాంటి చెత్త కేసులను సుప్రీంకోర్టు హడావిడిగా స్వీకరించదని తెలిపారు. సోమవారం నాడు సుప్రీంకోర్టులో ఒకవేళ అత్యవసర పిటిషన్ దాఖలు చేస్తే, జగన్ మోహన్ రెడ్డి గారి కేసులను వాదించిన న్యాయవాదులే, పిటిషనర్ తరఫున వాదనలు వినిపించనున్నారని అన్నారు. సుప్రీం కోర్టు త్వరగా విచారణను పూర్తి చేయమని చెప్పిన కేసునే, విచారణ నిలుపుదల చేయమని కోర్టుకు వెళ్తారా? అంటూ ప్రశ్నించారు. తమ వశీకరణ విద్యలతో సమాజంలో పెద్ద, పెద్ద వ్యక్తులను లోబర్చుకునే తెలివితేటలు ఉన్న మా ప్రభుత్వ పెద్దలను ఒక అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారి ఢీకొట్టడం అభినందనీయం అని అన్నారు.
గతంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు తన వెంట్రుక కూడా ఎవరు పీకలేరని పేర్కొన్నారని, ఎంత మంది దుష్టులు ఏకమైనా రాంసింగ్ గారి వెంట్రుక కూడా పీకలేరన్నది తన అభిమతమని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. ఈ కేసు వ్యవహారంలో తమ పార్టీ నాయకులు ఎవరిని కలిసినా వీక్ కావడం మినహా ఫలితం ఉండదని, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అవినాష్ రెడ్డి గారిని దోషి అని, ఇంకెవరో దోషి అని తాను అనడం లేదని, నిజమైన దోషి ఎవరో వై.యస్. వివేకానంద రెడ్డి గారి గాయాలకు కుట్లు వేయించి, రక్తపు మరకలు తుడిపించిన వారి ద్వారా నిజదోషులు ఎవరో తెలిసే అవకాశం ఉందని రఘురామకృష్ణరాజు గారు అన్నారు. వై.యస్. వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత మాజీ సహాయకుడు కృష్ణారెడ్డి వంటి పాత్రలను ప్రవేశపెట్టడం ద్వారా కోర్టులను గందరగోళపరచాలనే ప్రయత్నం జరుగుతున్నట్లుగా కనిపిస్తుందని, వై.యస్. వివేకానంద రెడ్డి గారికి ఆయన అల్లుడికి మనస్పర్ధలు ఉన్నాయని, ఆయనే ఎందుకు చంపి ఉండకూడదని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.