హత్యాయత్నానికి నో బెయిల్… హత్య చేస్తే బెయిల్ పక్కా అంటూ జగన్ ను ఉద్దేశించి సెటైర్లు పేల్చారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. న్యాయ స్థానాలలో తీర్పు ఆలస్యమైతే న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లి అవకాశం ఉందని, ఎటువంటి మచ్చలేని ఒక వ్యక్తిపై కక్షగట్టి తమ పగను తీర్చుకోవడం కోసం ప్రజలకు న్యాయవ్యవస్థపైనే సందేహాలను రేకెత్తించే విధంగా వ్యవహరించడం దారుణమని అన్నారు. న్యాయం చేయడానికి ఇంత ఆలస్యమా? అని ప్రశ్నించారు.
అవసరమైతే ధర్మాసనం గంటసేపు అధికంగా కూర్చుని, వాదనలను పూర్తిగా విని తీర్పును ఇస్తే సరిపోయేదని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. ఒకపక్క అన్యాయంగా జైల్లో పెట్టి, ఇన్ని రోజులుగా ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి భాషను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని, తాను లండన్ లో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారిని పోలీసులు ఎత్తేశారని జగన్ మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల పట్ల ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా, విభజిత ఆంధ్ర ప్రదేశ్ కు ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వ్యక్తి గురించి జగన్ మోహన్ రెడ్డి గారు మాట్లాడిన బజారు భాష ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు.