ఆంధ్ర ప్రదేశ్ పాలకులతో పోలిస్తే తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిందని రఘురామకృష్ణ రాజు అన్నారు. అభివృద్ధిలోనే కాకుండా, శాంతి భద్రతల పరిరక్షణలో, సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో కేసీఆర్ గారి ప్రభుత్వం చక్కటి కృషి చేసిందని, అయినా ఎమ్మెల్యేల పైన ఉన్న వ్యతిరేకత వల్ల తెలంగాణలో అధికార పార్టీ ఓటమిపాలయిందని తెలిపారు.
ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చిన చోట ఆ పార్టీ విజయం సాధించిందని, వ్యక్తిగతంగా కేసీఆర్ గారిపైన వ్యతిరేకత లేనప్పటికీ, కారణాలేవైనా కానీ ప్రజలు మార్పును కోరుకున్నారని, ప్రజలు కోరుకున్నట్టే ప్రభుత్వ మార్పు జరిగిందని అన్నారు. అయినా 119 స్థానాలలో, అధికార బీఆర్ఎస్ 39 స్థానాలలో విజయం సాధించిందని, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు గట్టిగా మార్పును కోరుకుంటున్నారని, ఎంత గట్టిగా అంటే 175 స్థానాలలో అధికార పార్టీకి 15 నుంచి 20 స్థానాలు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఓటమికి దుష్ట నాయకులతో చెలిమే కారణమని తన భావన అని రఘురామకృష్ణ రాజు తెలిపారు.