ఫిలిప్పీన్స్ కు చెందిన మార్కోస్ ను మించి రాజకీయ విధ్వంసానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాల్పడుతున్నారని రఘురామకృష్ణ రాజు విమర్శించారు. ప్రజలు అచేతనంగా ఉండడం వల్ల రాష్ట్రంలో విచ్చలవిడిగా వైకాపా నాయకుల ప్రోద్బలంతో దొంగ ఓట్లను నమోదు చేయడం జరుగుతోందని, ఫామ్ 7 దాఖలు చేస్తారు… ఓట్లను తొలగిస్తారు… ఇంత విశ్రుంకలంగా, దారుణంగా, దరిద్రంగా ఇన్ని అరాచకాలు చేయొచ్చననే ఆలోచన కూడా గతంలో ఎవరికీ వచ్చి ఉండకపోవచ్చునని అన్నారు.
ఓటరు జాబితాలో పేరు లేని వారు, ఓటు నమోదు కోసం సంబంధిత దరఖాస్తు పత్రాన్ని అందజేసి… నా ఓటు నాకు ఎందుకివ్వవని అధికారులను చొక్కా పట్టుకుని నిలదీయాలన్నారు. పార్లమెంటరీ లా అండ్ జస్టిస్ కమిటీ పరిధిలోకి ఎన్నికల కమిషన్ వస్తుందని, రాష్ట్రంలో దొంగ ఓట్ల నమోదు ప్రక్రియపై వారి చెవిలో జోరీగలా దొంగ ఓట్ల నమోదుపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని తెలిపారు. ప్రజలే ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం నడుము బిగించి దొంగ ఓట్లను ఏరి వేయడంతో పాటు, తమ ఓటు హక్కును విధిగా నమోదు చేయించుకోవాలని కోరారు. దొంగ ఓట్ల నమోదు ప్రక్రియను వైకాపా నిరంతర యజ్ఞంగా కొనసాగిస్తోందని, పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ కంటే ఎక్కువగా తగ్గేదేలే అన్నట్లు ఫామ్ 7 దరఖాస్తు చేస్తూ, అడ్డగోలుగా ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని అన్నారు.