రుషికొండపై నిర్మించిన భవన సముదాయంలో బాత్ టబ్ ఖరీదు 25 లక్షల రూపాయలని తెలిసిందని రఘురామకృష్ణ రాజు గారు వెల్లడించారు. ఈ భవన నిర్మాణ సముదాయం కోసం 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించారని, ఒక్కొక్క చదరపు అడుగు కోసం సుమారు 25 వేల నుంచి 26 వేల రూపాయలకు వరకు ఖర్చు చేశారని, ఒక్క కమోడ్ ధరనే అక్షరాల 10 లక్షల రూపాయలట అని, ఒక్క టాయిలెట్ కు రెండు లక్షల రూపాయలు వేసుకున్నా ఒక పేదవాడి గృహ నిర్మాణం అని పేర్కొన్న ఆయన, కమోడు ధరలో పేదవారి కోసం ఐదు జగనన్న గృహ నిర్మాణాలను చేపట్టవచ్చునని అన్నారు.
బాత్ టబ్ కోసం వెచ్చించిన 25 లక్షల రూపాయల ఖర్చులో పన్నెండున్నర జగనన్న గృహాల నిర్మాణం సాధ్యమై ఉండేదని, ఇప్పటి వరకు ప్రజల నుంచి దోచుకున్న సొమ్ముతో రాష్ట్రంలోను, ఇతర రాష్ట్రాలలోనూ ప్యాలెస్ లను నిర్మించుకున్న జగన్ మోహన్ రెడ్డి గారు… ఇప్పుడు ఏకంగా ప్రజాధనంతోనే రుషికొండపై ప్యాలెస్ ను నిర్మించుకున్నారని అన్నారు. అధికారంలో నుంచి దిగిపోయేలోగానే ఈ ప్యాలెస్ ను తన వందిమాగాదుల పేరిట లీజు ద్వారా పొందాలనే ప్రయత్నాలు చేస్తున్నారని, తాడేపల్లి ప్యాలెస్, హైదరాబాదులోని లోటస్ పాండ్ ప్యాలెస్, బెంగుళూరు లోని ప్యాలెస్, ఇడుపులపాయలోని ప్యాలెస్ ఇప్పటికే పూర్తయిన ప్యాలెస్ లతో పాటు, ఇంకా కట్టబోయే ఎన్నో విశాలమైన ప్యాలెస్లలో ఎంత మంది నివసిస్తారని ప్రశ్నించారు.