గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాన్ని పరిశీలిస్తే ఎంతో పరిణితి చెందిన ప్రజా నాయకుడిగా మాట్లాడారని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆయన తనపై ఎన్నో ఒత్తిళ్లు ఉన్నాయని, అందుకే రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తున్నట్లు చెప్పారని తెలిపారు. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై టీడీపీ, జనసేన నాయకుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయని, గతంలో నెగ్గిన రాజోలుతో పాటు మరో స్థానానికి పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థులను ప్రకటించగానే వైకాపా నాయకులు చంకలు కొట్టుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని అన్నారు.
జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గద్దె దించడమే తన ధ్యేయమని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మరోసారి పునరుద్గాటించారని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ – జనసేన కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న పవన్ కళ్యాణ్, సంస్థాగత ఎన్నికలలో ఎక్కువ స్థానాలలో పోటీ చేసి పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేసుకుందామని చెప్పారన్నారు.
అటు టీడీపీ, జనసేన నాయకులను కార్యకర్తలను నొప్పించకుండా సుతిమెత్తగా, ఎంతో వద్దికగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తీరు అభినందనీయమని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. రెండు, మూడు రోజుల వ్యవధిలో సీట్ల సర్దుబాటుపై టీడీపీ, జనసేన నాయకులు చర్చించుకునే అవకాశాలు ఉన్నాయని, ఆ తర్వాతే అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల అభ్యర్థులను ఖరారు చేసి ఉంటారని, మరికొన్ని చోట్ల ప్రత్యర్థి అభ్యర్థిని బట్టి కూటమి అభ్యర్థిని కూడా ఖరారు చేసే అవకాశం ఉందని అన్నారు.