కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రైల్వేకు ఈ ఏడాది రూ.9,151 కోట్లు కేటాయించామని ఆ శాఖమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అమరావతికి రైలు మార్గం అనుసంధానం కోసం రూ.2,047 కోట్లతో 56 కిలోమీటర్ల రైల్వేలైన్‌ను అభివృద్ధి చేయబోతోందని వెల్లడించారు. ఈ మార్గంలో కృష్ణా నదిపై ఒక భారీ వంతెన కూడా నిర్మిస్తున్నందున ప్రాజెక్టు వ్యయం పెద్ద స్థాయిలో ఉందని స్పష్టం చేశారు.
లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో బుధవారం రోజున ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్‌లో ఉన్న రైల్వే లైన్ల పూర్తి, విజయవాడ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ గురించి టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి బదులిచ్చారు. ఈ పద్దులో ఏపీకి గతంలో ఎన్నడూ లేనన్ని నిధులు కేటాయించామని.. ఈ ఏడాది రాష్ట్రానికి మొత్తం రూ.9,151 కోట్లు కేటాయించామని తెలిపారు. రాష్ట్రంలో రైల్వేలైన్ల విద్యుదీకరణ 100% పూర్తయిందని.. ప్రస్తుతం ఏపీలో రూ.73,743 కోట్ల విలువైన ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని చెప్పారు. అమరావతి రైల్వే లైనుకు సంబంధించిన డీపీఆర్‌కు రైల్వే బోర్డు ఆమోదం తెలిపిన తర్వాత ఇటీవల నీతిఆయోగ్ ఆమోదం తెలిపిందని వివరించారు.