రాష్ట్ర అభివృద్ధిలో రైల్వే జోన్ కీలకమైందని అన్నారు ప్రధాని మోదీ. ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. విశాఖ కేంద్రంగా శంకుస్థాపన చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ రాష్ట్ర అభివృద్ధిలో కీలకం కానుందని పేర్కొన్నారు. ఈ జోన్ ద్వారా రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతుందని తెలిపారు.
దీంతోపాటు వ్యవసాయ, పర్యాటక రంగాలు కూడా ఊపందుకుంటాయని అన్నారు మోడీ. ఆంధ్రప్రదేశ్ లో 7 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని.. అమృత్ భారత్ కింద 70కి పైగా రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర చిరకాల కళ ఐన విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు ఈరోజు పునాది వేసామని తెలిపారు. దీనివల్ల ఈ ప్రాంత ప్రజలకు పర్యాటకంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
రాష్ట్రంలో మత్స్యకారుల జీవనం మెరుగుపడేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. అలాగే ఐటీ, టెక్నాలజీకి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కేంద్రం కానుందని తెలిపారు. విశాఖకు కేటాయించిన గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఎంతో మందికి ఉపాధి ఇస్తుందని, మూడు రాష్ట్రాల్లోనే వస్తున్న బల్క్ డ్రగ్ పార్క్ ని విశాఖలోని నక్కపల్లికి కేటాయించామని తెలిపారు.