ఈ మధ్య తరచూ రైలు ప్రమాదాలు ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఓవైపు అగ్నిప్రమాదాలు.. మరోవైపు సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాల వల్ల జరుగుతున్న ఘటనలు.. ఇంకోవైపు రైల్వే ట్రాక్‌ల డ్యామేజ్ ఇలా రకరకాలుగా జరుగుతున్న ప్రమాదాలు ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో ఓ రైలుకు పెను ప్రమాదం తప్పింది. ఇంతకీ ఏం జరిగిందంటే..?
జిల్లాలోని పూతలపట్టు మండలం పి.కొత్తకోట సమీపంలో చిత్తూరు-పాకాల రైలు మార్గంలో ఓ రైలు పట్టా విరిగింది. దీన్ని ట్రాక్‌మెన్ సకాలంలో గుర్తించడంతో రామేశ్వరం ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం 9.30 గంటల సమయంలో ఈ రైలు చిత్తూరు నుంచి తిరుపతికి బయల్దేరగా.. అదే సమయంలో ట్రాక్‌మెన్ పట్టాలు పరిశీలించారు.
కొత్తకోట సమీపాన విరిగిన పట్టాను గమనించి వెంటనే ఎర్రజెండా చూపుతూ రైలుకు ఎదురుగా పరుగు తీయగా.. అతడిని గమనించిన డ్రైవర్ వెంటనే రైలు నిలిపేశారు. రైల్వే సిబ్బంది హుటాహుటిన వచ్చి విరిగిన పట్టాకు మరమ్మతు చేయడంతో.. దాదాపు 45 నిమిషాలు రైలు అక్కడే నిలిచిపోయింది. చలికాలంలో రైలు పట్టాలకు పగుళ్లు రావడం సాధారణమేనని సిబ్బంది పేర్కొన్నారు.