ఏపీలోని ముంపు ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలపై కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పందించారు. భారీ వర్షాల కారణంగా విజయవాడ, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాలు జలమయం కాగా, ముంపు ప్రాంతాల ప్రజల కోసం సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. వారికి డ్రోన్ల ద్వారా ఆహారం అందజేస్తున్నారు. మెడిసిన్స్, తాగునీటి సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. అయితే, వరదల వలన సర్వం కోల్పోయిన తమను ఆదుకోవాలని ముంపు గ్రామాల బాధితులు ప్రభుత్వానికి వేడుకుంటున్నారు.
ఈ క్రమంలోనే విజయవాడలో కొనసాగుతున్న సహాయక చర్యలపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ..విపత్తు సమయంలో ఎలా స్పందించాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలుసు అని అన్నారు. 15ఏళ్లుగా డ్రోన్ టెక్నాలజీ ఉన్నా ఎవరూ వినియోగించుకోలేదని, తొలిసారి డ్రోన్ల ద్వారా బాధితులకు ఆహారం, పండ్లు, పాలు, మెడికల్ కిట్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. విపత్తుల్లో ఎలా స్పందించాలో సీఎంకు తెలుసునన్నారు. ఆయనకు ఉన్న అనుభవంతోనే ప్రజలతో మమేకమై అధికారులకు సూచనలు చేస్తున్నారన్నారు.