సీఎం జగన్ ఆటో జానీ గెటప్ అదుర్స్ – వైసీపీ ఎంపీ

-

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి ఆటో జానీ గెటప్ అదిరిందని, రౌడీ అల్లుడు సినిమాలో చిరంజీవి, భాషా చిత్రంలో రజినీకాంత్ గారి మాదిరిగా ఆటో డ్రైవర్ పాత్రలో జగన్ మోహన్ రెడ్డి గారు ఒదిగిపోయారని, ముఖ్యమంత్రి పాత్ర కంటే ఆయనకు ఆటోడ్రైవర్ పాత్రే అద్భుతంగా ఉందని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. కార్మికుడైన ఆటో డ్రైవర్ డ్రెస్ కోడ్ ను ముఖ్యమంత్రి గారు నిత్యం కంటిన్యూ చేయాలని సూచించారు. కోర్టులకు కూడా వెళ్లకుండా పేదవాని కోసం కార్మికుడిలా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారని అన్నారు.

rrr comments on cm jagan getup
rrr comments on cm jagan getup

విజయవాడలో నిర్వహించిన జగనన్న వాహన మిత్ర కార్యక్రమంలో పాల్గొనే ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలకడానికి సుమారు 15 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు అయిన ఆర్థిక భారం కూడా ప్రజలపైనే పడునుందని, అంతకంటే ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ లో సమావేశ ప్రాంగణానికి చేరుకొని ఉంటే బాగుండేదని ఎద్దేవా చేశారు. ఆటో, టాక్సీ డ్రైవర్లు మొత్తం 8,20,000 మంది ఉండగా, జగనన్న వాహన మిత్ర పథకంలో కేవలం రెండు లక్షల 50 వేల మందిని మాత్రమే అర్హులుగా ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగించిందని, అంటే మిగిలిన ఆటో డ్రైవర్లు, క్యాబ్, టాక్సీ డ్రైవర్లు ధనవంతులై ఉంటారు కాబోలని రఘురామకృష్ణ రాజు గారు అపహాస్యం చేశారు.

ఆటో డ్రైవర్లకు ఏడాదికి 10,000 చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నామని చెబుతూ, ప్రతి నెల 10 వేలకు తగ్గకుండా పెనాల్టీలు విధిస్తున్నారని ఆటో డ్రైవర్లు వాపోతున్నారని తెలిపారు. జగనన్న వాహన మిత్ర కార్యక్రమానికి డ్వాక్రా మహిళలకు ఉన్న సంబంధం ఏమిటి?, ఈ కార్యక్రమానికి కూడా స్కూళ్లను బందు పెట్టి డ్వాక్రా మహిళలను బస్సులలో తరలించడం విడ్డూరంగా ఉందని అన్నారు. జగనన్న వాహన మిత్ర కార్యక్రమానికి ఆటో డ్రైవర్లు కూడా హాజరు కావడం లేదని తెలిసి డ్వాక్రా మహిళలను బలవంతంగా సభా ప్రాంగణానికి తరలించారని, ప్రభుత్వ ఖర్చుతో నిర్వహించే సభను కూడా ముఖ్యమంత్రి గారు తన పార్టీ ఎన్నికల క్యాంపెయిన్ సభగా వినియోగించడం ఎంత వరకు సమంజసమని విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలని రఘురామకృష్ణ రాజు గారు కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news