జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి నోటికొచ్చినట్లు మాట్లాడే డర్టీ క్యారెక్టర్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిదని రఘురామకృష్ణ రాజు గారు విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారి గురించి సామర్లకోట సభలో జగన్ మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ హైదరాబాదులో పవన్ కళ్యాణ్ గారి ఇల్లు ఉన్నప్పటికీ, మూడేళ్లకు ఒకసారి ఇల్లాలు మారిపోతుందని, ఒకసారి లోకల్, మరొకసారి నేషనల్, ప్రస్తుతం ఇంటర్నేషనలని, ఆ తర్వాత ఇంకెక్కడి నుంచి చేసుకుంటారని ఆయన చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే జగన్ మోహన్ రెడ్డి గారిది ఎంత డర్టీ క్యారెక్టర్ అనేది అర్థమవుతుందని అన్నారు.
పవన్ కళ్యాణ్ గారు తన కులం గురించి కూడా చెప్పుకోలేకపోతున్నారని జగన్ మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలపై రఘురామకృష్ణ రాజు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా నా రెడ్లు అని సంబోధించారా? అని ప్రశ్నిస్తూనే… నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని పేర్కొన్నారే తప్పితే, ఏనాడైనా నా రెడ్లు, నా క్రిస్టియన్లు అని సంబోధించారా అంటూ నిలదీశారు. తన సొంత సామాజిక వర్గం, మతం వారికే ప్రభుత్వ నామినేటెడ్ పదవులను మాత్రం ఇస్తారని అన్నారు. ఎవరి కులాన్ని వారు ఎంతో కొంత ప్రేమించుకోవడం సహజం అని, పక్క కులాలని జగన్ మోహన్ రెడ్డి గారి మాదిరిగా ద్వేషించడం దోషమని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారికి కమ్మ కులస్తులంటే ద్వేషమని, క్షత్రియులన్న అంతే ద్వేషమని, రెడ్డి అనేది కులం కాదు… అది టైటిల్ మాత్రమేనని, రెడ్డి కులంలో ఎన్నో ఉప కులాలు ఉన్నాయని, అందులో జగన్ మోహన్ రెడ్డి గారు ఏ ఉప కులానికి చెందినవారో తెలియదని అన్నారు.