దీపావళి రోజు శ్రీవారిని దర్శించకున్న 75 వేల మంది భక్తులు

-

దేశవ్యాప్తంగా దీపావళి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. దీపావళి సందర్భంగా ఆదివారం రోజున దేశంలోని పలు ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల్లోనూ తెల్లవారుజామునే భక్తులు ఆలయాలకు తరలివెళ్లారు. ముఖ్యంగా పండును పురస్కరించుకుని కలియుగ వైకుంఠమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

దీపావళి పండుగ రోజున మొత్తం 74,807 మంది తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు.  మొత్తం 21,974 మంది తలనీలాలు సమర్పించుకున్నారని వెల్లడించారు. భక్తుల రద్దీ కారణంగా టోకెన్‌లు లేని భక్తులకు సర్వదర్శనానికి 6 గంటల సమయం పట్టిందని పేర్కొన్నారు. పండుగ సందర్భంగా భక్తులు భారీగా రావడంతో శ్రీవారికి హుండీ ఆదాయం కూడా భారీగా పెరిగిందని వివరించారు. దీపావళి ఒక్కరోజే శ్రీవారి హుండీకి రూ.3.58 కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు.

మరోవైపు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని టీటీడీ అధికారులు తెలిపారు. దీపావళి సందర్భంగా స్వామి వారిని పూలతో ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేసినట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news