ఇవే చివరి ఎన్నికలు అని చంద్రబాబే కాదు జనాలు కూడా అనుకున్నారని ఎద్దేవా చేశారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. అందుకే 2019లోనే చంద్రబాబును , టీడీపీ ని సాగనంపారని అన్నారు. చంద్రబాబు దింపుడు కళ్ళెం ఆశలా ప్రజలను అడుగుతున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో బెదిరింపులు, ఏడుపులు, పెడబొబ్బలకు విలువ ఉండదన్నారు.
చంద్రబాబు తన కోసం ప్రజలు ఉన్నారు అనే భ్రమలో ఉన్నాడు అని అన్నారు. తన భార్య పేరును పది సార్లు ప్రజల్లో చెప్పటం ద్వారా చంద్రబాబే ఆమెను అవమానిస్తున్నారన్నారు. బహుశా చంద్రబాబు ప్రవర్తనకు ఆమె కూడా కుమిలిపోతూ ఉంటారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. లేనివన్నీ అతనే ప్రజలకు గుర్తు చేస్తున్నాడని.. నేను ముఖ్యమంత్రిగానే వస్తానని అనటం ఏంటి? అని ప్రశ్నించారు.
రాష్ట్రం, ప్రజలు తనకు బాకీ ఉన్నారని అనుకుంటున్నారా? అని మండిపడ్డారు. చంద్రబాబు మాటల్లో అధికారం నాకు హక్కు అన్న ధోరణి కనిపిస్తోందన్నారు సజ్జల. ఎవరైనా చంద్రబాబు భార్యను అవమానిస్తే …ప్రజలు చంద్రబాబుకు ఎందుకు ఓట్లు వేయాలి? అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ హైవే పై లెక్కలేనితనంతో వ్యవహరించాడన్నారు. బీజేపీ నుంచి ఎవరు సాఫ్ట్ వైఖరి ఆశిస్తున్నారని ప్రశ్నించారు.