వైఎస్ షర్మిల అరెస్టుపై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి

-

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో కారుతో హల్చల్ చేశారు. పోలీసుల కళ్ళు కప్పి లోటస్ పాండ్ నుంచి సోమాజిగూడ చేరుకున్న వైయస్ షర్మిల.. సోమాజిగూడ నుండి ప్రగతి భవన్ కి వెళ్లేందుకు ప్రయత్నించింది. నిన్న దాడిలో అద్దాలు పగిలిన కారుని స్వయంగా నడుపుకుంటూ వచ్చిన షర్మిల వాహనాన్ని అడ్డుకున్నారు పోలీసులు.

దీంతో రోడ్డుపైనే వాహనాన్ని నిలిపిన షర్మిల కారు నుంచి బయటకి రాలేదు. పోలీసులు బయటకు రావాలని కోరినప్పటికీ తాను ప్రగతి భవన్ కి వెళతానని షర్మిల పట్టుబట్టింది. కార్ డోర్లు లాక్ చేసుకుని లోపల ఉండిపోయింది షర్మిల. దీంతో చేసేదేమీ లేక షర్మిల కారు లోపల ఉండగానే క్రేన్ సహాయంతో వాహనాన్ని ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ కారు డోర్స్ బ్రేక్ చేసి షర్మిలను పోలీస్ స్టేషన్ లోకి తరలించారు. దీంతో ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అభిమానులు చేరుకుంటున్నారు.

అయితే షర్మిల అరెస్టుపై స్పందించారు ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. వైయస్ షర్మిల అరెస్టు వ్యక్తిగతంగా బాధాకరమని అన్నారు. కానీ ఆమె పార్టీ తెలంగాణలో ఉందని, రాజకీయపరమైన విధానాలపై, ఆమె తీసుకునే నిర్ణయాలపై మీడియా అడగడం, తాను స్పందించడం సరికాదన్నారు. మా నాయకుడు రాజశేఖర్ రెడ్డి కుమార్తె, మా ముఖ్యమంత్రి జగన్ సోదరి అయినందున ఆమె పట్ల తెలంగాణలో జరిగిన ఘటన మాకు వ్యక్తిగతంగా బాధ కలిగించిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news