ఎన్నికల వేళ ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు సంచలనంగా మారింది. కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వివేకా హత్యకు కారణమని.. సీఎం జగన్ నిందితులను కాపాడటమే కాకుండా వారికి టికెట్లు ఇస్తున్నారంటూ జగన్ సోదరి, ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ వివేకా హత్యపై అవినాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం పులివెందులలో వైసీపీ నేతల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. నేనేంటో నా మనస్తత్వం ఏంటో ప్రజలందరికి తెలుసని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో మూడేళ్లుగా ప్రతిపక్షాలు తనను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయి.
అయినప్పటికీ చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ప్రజల మధ్యలోనే ఉన్నానని తెలిపారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా తాను ప్రజల్లోనే ఉంటానని అవినాష్ రెడ్డి చెప్పారు. తాను ఎటువంటి తప్పు చేయలేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు. కడప నుంచి అవినాష్ రెడ్డి ఎంపీగా బరిలోకి దిగుతున్నారు. అదే స్థానం నుంచి కాంగ్రెస్ తరపున షర్మిల కూడా బరిలోకి దిగడం గమనార్హం.