ఆంధ్రప్రదేశ్‌లో పీ-4 (ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజల, భాగస్వామ్యం)తో సమాజంలోని పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని విస్తృతం చేసేందుకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం భావిస్తున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రస్థాయి సొసైటీ ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు.
జీరో పావర్టీ, పీ-4పై సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సొసైటీకి సీఎం ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. మార్గదర్శులను కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు గుర్తించేలా ఈ వ్యవస్థను రూపొందించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఆగస్టు 15వ తేదీ నాటికి 5 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా కార్యాచరణ రూపొందించనున్నట్లు వెల్లడించారు. సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న 10 శాతం మంది.. అట్టడుగున ఉన్న 20 శాతం మంది పేదలను దత్తత తీసుకుని వారికి అండగా నిలిచి పేదరికం నుంచి బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఏపీ సర్కారు పీ-4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.