అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గత నెలరోజులుగా పరారీలో ఉన్న విషయం తెలిసిందే. ఆయన కోసం పోలీసులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఏపీలో గాలిస్తూనే ఉన్నారు. మరోవైపు ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లపై నిఘా పెట్టారు. అయితే తాజాగా కాకాణి ఆచూకీ చెబితే బహుమతి ఇస్తానంటూ మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎక్కడున్నాడో తెలియడం లేదని.. ఆయన ఆచూకీ తెలిపితే కాకాణి ఇంటి పక్కన ఉన్న కరోనా హౌస్ ను బహుమతిగా ఇద్దామని ఆలోచిస్తున్నా అని సోమిరెడ్డి ప్రకటించారు. వైసీపీ వాళ్లు కానీ ఎవరైనా ముందుకు వచ్చి ఆయన ఆచూకీ తెలపాలని కోరారు. పోలీసుల చొక్కాలు విప్పుతానని సవాళ్లు విసిరి.. తొడలు కొట్టి.. ఇప్పుడు పిరికి పందలా దాక్కున్నాడంటూ విమర్శించారు. కాకాణి దర్శనమిస్తే చూడాలని ఉందని.. ఆయణ్ను చూసి చాలా రోజులైందని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. మంత్రులుగా పని చేసిన వాళ్లు ఇలా పిరికివాళ్లుగా పారిపోతారని అనుకోలేదంటూ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సెటైర్లు వేశారు.