రోహిత్ వేముల చట్టాన్ని రూపొందించి అమలు చేయాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్, రోహిత్ వేముల లాంటి వారికి వచ్చిన పరిస్థితిని ఎవ్వరూ ఎదుర్కోకుండా ఉండేందుకు రోహిత్ వేముల చట్టాన్ని రూపొందించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు తెలిపారు రాహుల్. ఈ మేరకు తాజాగా ఎక్స్ వేదికగా వివరాలను రాహుల్ గాంధీ వెల్లడించారు.
ఇటీవల పార్లమెంట్ లో తను దళిత, ఆదివాసీ, ఓబీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులను కలిసినట్టు తెలిపారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో కుల వివక్షను వారు ఎలా ఎదుర్కుంటున్నారో వారు తెలిపినట్టు వివరించారు. అంబేద్కర్ విద్య ద్వారా అణగారిన వర్గాలు తమను తాము శక్తివంతం చేసుకోగలరని.. కులతత్వ అడ్డంకులను చేదించగలరని దారి చూపించారని తెలిపారు. దశాబ్దాల తరువాత కూడా ఇప్పటికీ దళిత, ఆదివాసీ, ఓబీసీ వర్గాలకు చెందిన లక్షలాది మంది విద్యా వ్యవస్థలో వివక్ష ఎదుర్కోవడం దురదృష్టకరమని రాహుల్ పేర్కొన్నారు.