స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీ బుధవారం సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. చంద్రబాబు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన మెన్షన్ మెమోపై సీజేఐ చంద్రచూడ్ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై రేపు విచారణ చేపట్టేందుకు అంగీకరించారు. ఈ పిటిషన్ ఏ బెంచ్ ముందు విచారణకు వస్తుందో సాయంత్రం వరకు తెలియనుంది.
అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఎ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన పిటిషన్‌పై బుధవారం విచారణ చేపడతామని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది.
మరోవైపు చంద్రబాబు బెయిల్, కస్టడీపై విజయవాడ ఏసీబీ కోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది. స్కిల్ కేసులో చంద్రబాబును మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై కౌంటర్ వేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులకు కోర్టు సూచించింది. మరోవైపు చంద్రబాబు బెయిలు పిటిషన్, సీఐడీ కస్టడీ పిటిషన్లను ఇవాళ విచారించి రెండింటిపై ఒకేసారి నిర్ణయం వెలువరిస్తామని కోర్టు తెలిపింది.