స్వర్ణాప్యాలెస్ ప్రమాదం పై జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో వేసిన కమిటీ ప్రాధమిక నివేదికను వెల్లడించింది. హోటల్ నిర్వహణలో ఆసుపత్రి యంత్రాంగం అవసరమైన జాగ్రత్తలు తీసుకోలేదని గుర్తించారు. జీవో 77ను అతిక్రమించి ఆసుపత్రి యాజమాన్యం ఫీజులను భారీగా వసూలు చేసిందని కమిటీ గుర్తించింది. కోవిడ్ కేర్ అందించడంలో కేటగిరి ఏ ట్రీట్మెంట్ అందించే అసుపత్రిగా ఉన్న రమేష్ ఆసుపత్రి అనుమతులను రద్దు చేస్తూ కృష్ణాజిల్లా కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఇవి అమల్లో ఉంటాయని కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ పేర్కొన్నారు.
ఫైవ్ మెన్ కమిటీ హాస్పటల్ లో గుర్తించిన లోటుపాట్లను తెలియజేస్తూ ఆసుపత్రికి కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. కమిటీ రిపోర్ట్ ఆధారంగా హోటల్ లో కోవిడ్ కేర్ సెంటర్ నిర్వహణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని కలెక్టర్ పేర్కొన్న్నారు. రూల్ 9 ఏపి అలోపతిక్, ప్రైవేట్ మెడికల్ కేర్ రిజిస్ర్టేషన్, రెగ్యులేషన్ రూల్స్ ను రమేష్ హాస్పటల్ పట్టించుకోలేదని, ఆసుపత్రి రిసెప్షన్ లో అందిస్తున్న సేవల రేటు ఇంగ్లీష్ లోనూ, తెలుగులోనూ ప్రదర్శించాలని అలాంటి బోర్డును ఏదీ ఆసుపత్రి వద్ద ప్రదర్శించలేదని కమిటీ గుర్తించినట్టు తెలుస్తోంది. మెట్రో పాలిటన్ హోటల్, ఎం- 5 హోటల్ లో జిల్లా అధికారుల అనుమతి లేకుండానే కోవిడ్ రోగులను జాయిన్ చేసుకున్నట్లు కమిటీ గుర్తించారు.