టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యం విషమించిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఆయన తాడెపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ముచ్చటించారు. చంద్రబాబుకు ముప్పు ఉందంటూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.
చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ డ్రామాలు చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి ఇదే తరహాలో ప్రచారం జరుగుతుందని తెలిపారు. జైలు ఏమైనా అత్త గారిల్లా..? ఏసీ అడుగుతున్నారు అని ప్రశ్నించారు. రాజమండ్రి జైలులో ఉక్కపోత పెరిగితే చంద్రబాబు ఒక్కరికే కాదు అందరికీ సమస్యలుంటాయి. చంద్రబాబుకు ఇంటి నుంచే భోజనం వస్తోంది. దానిని అధికారులు పరిశీలించిన తరువాత చంద్రబాబుకు ఇస్తున్నారు. డీ హైడ్రేషన్ తో మొదలు పెట్టి ప్రాణాలకు ప్రమాదం అనేంత వరకు వచ్చారు. స్కిన్ ఎలర్జీతో ప్రాణాలకే ముప్పు అని ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. జైలు అధికారులు, డాక్టర్ల పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. చంద్రబాబు బరువు తగ్గారంటూ మరో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు సజ్జల. అర్జెంట్ గా చంద్రబాబును బయటికి తీసుకురావాలనేది టీడీపీ ప్లాన్ అని చెప్పారు సజ్జల.