గెలుపే ప్రాతిపదికన రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు ఏ స్థానం నుంచి పోటీ చేయాలన్న దానిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నివాసంలో ఆయనతో టీడీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చర్చించారని, ఇద్దరి మధ్యలో చర్చలు ఫలప్రదంగా ముగిశాయని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. గతంలో తన ఇంటికి వచ్చి పరామర్శించిన పవన్ కళ్యాణ్ గారిని ఆయనే ఇంటికి వెళ్లి చంద్రబాబు నాయుడు గారు పలకరించారని వివరించారు.
చంద్రబాబు నాయుడు గారికి సతీసమేతంగా గుమ్మం వద్దే పవన్ కళ్యాణ్ గారి దంపతులు స్వాగతం పలికారని అన్నారు. రాజకీయంగా శత్రువును కూకటి వేళ్లతో పెకిలించాలనుకుంటే వ్యూహం అన్నది ఉండాలని, ఇప్పటికే తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరిందని, తాజాగా తమ కిం కర్తవ్యం ఏమిటి అని రెండు పార్టీల అగ్ర నాయకులు చర్చించారని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలకు ప్రశాంతత చేకూరాలంటే, రెండు పార్టీలకు చెందిన అభ్యర్థుల బలాబలాలను బేరీజు వేసుకొని, ఏ పార్టీకి చెందిన అభ్యర్థి ఏ స్థానం నుంచి పోటీ చేయాలని ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసిందని, ఇరువురి మధ్య జరిగిన సమావేశం విజయవంతంగా ముగియడం పట్ల రఘురామకృష్ణ రాజు గారు హర్షం వ్యక్తం చేశారు.