పల్నాడు జిల్లా నరసరావు పేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు వ్యవహారం పై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. నిన్న ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో చదలవాడ హల్ చల్ చేశారు. ఆయన వ్యవహరించిన తీరు సరికాదని పార్టీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటన పై వివరణ ఇవ్వాలని తాజాగా టీడీపీ కేంద్ర కార్యాలయం ఆదేశించింది. అరవింద బాబు ఎక్సైజ్ కమిషనరేట్ లో గురువారం రచ్చ చేశారు. ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్ కుమార్ లేని సమయంలో ఆయన ఛాంబర్ లోకి ప్రవేశించి రభస చేశారు.
తొలుత యాంటీ రూమ్ లోపలికి వెళ్లి దిండ్లు తెచ్చుకున్నారు. ఛాంబర్ లో కొంత సేపు సోఫా పై కూర్చున్న ఆయన తరువాత నేలపై పడుకొని తాను చెప్పినట్టుగా ఆదేశాలివ్వాలంటూ భీష్మించారు. ఎక్సైజ్ ఉన్నతాధికారులు ఆయనకు పదే పదే సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా వినలేదు. దీంతో ప్రభుత్వ పార్టీ పెద్దల దృష్టికి ఈ విషయం వెళ్లింది. ఆయనను ఎక్సైజ్ కమిషనరేట్ నుంచి వెనక్కి రావాలని చెప్పేందుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు.. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా అరవిందబాబు స్పందించలేదు. దీనిపై అధిష్టానం ఆగ్రహంగా ఉంది.