ఏపీలో ముంబై నటి కాదంబరి జెత్వానీ నమోదు చేసిన కేసుపై ఆ రాష్ట్ర డీజీపై ద్వారాకా తిరుమల రావు గురువారం తాజాగా స్పందించారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ జరుగుతోంది. ఇందులో పోలీసుల పాత్ర ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే విజయవాడ సీపీతో మాట్లాడి వివరాలు సేకరించినట్లు డీజీపీ పేర్కొన్నారు. తప్పు ఎవరు చేసినా బాధ్యత వహించాల్సిందేనని స్పష్టంచేశారు. ఈ కేసులో ఎంత పెద్ద వారున్నా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
ఇదే విషయంపై విజయవాడ సీపీ రాజశేఖర బాబు సైతం స్పందిస్తూ.. ఈ కేసు ఇంకా దర్యాప్తు దశలోనే ఉంది. కేసుకు సంబంధించిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా సేకరిస్తున్నామని చెప్పారు. ఈ కేసులో ప్రధానంగా పలువురు ఐపీఎస్ అధికారులపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందులో వాస్తవం ఎంత మేర ఉన్నదనే విషయాన్ని తెలుసుకుంటున్నామని తెలిపారు. కాగా,గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పొలిటికల్ లీడర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు బాలీవుడ్ నటిని లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు రావడంతో ఈ కేసుపై ఉన్నతాధికారులు ప్రధానంగా దృష్టిసారించారు.