ఏపీలోని తిరుపతి జిల్లాలో రహదారులు మరోసారి నెత్తురోడాయి. ఇవాళ ఉదయం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు దుర్మరణం చెందారు. ఏర్పేడు మండలం మేర్లపాక వద్ద ఆర్టీసీ బస్సును కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి పంపించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తిరుమల శ్రీవారి దర్శనం చేసుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడిక్కడే మరణించారని తెలిపారు. మృతులంతా తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లె వాసులుగా గుర్తించారు. ప్రమాదంలో భార్యాభర్తలు, చిన్నారి మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.