ఈ మధ్య కాలంలో తరచూ పులులు మృత్యవాత పడుతున్నాయి. కొన్ని వాతావరణ మార్పుల వల్ల మరణిస్తుంటే.. మరికొన్ని అనారోగ్య కారణాల వల్ల చనిపోతున్నాయి. మధ్యప్రదేశ్లోని కూనో పార్కులో పులులు మృత్యువాత పడుతున్న విషయం తెలిసిందే. తాజాగా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్కులో పెద్దపులి పిల్ల మృతి చెందింది. కర్నూలు జిల్లా నుంచి ఇటీవల తల్లి నుంచి వేరుపడిన నాలుగు పెద్దపులి పిల్లలను సంరక్షణ కోసం తిరుపతి జూ పార్కుకు రప్పించారు. వీటిలో ఒకటి మంగళవారం అర్ధరాత్రి మృతి చెందింది.
సంరక్షణ కోసం తీసుకువచ్చిన పెద్దపులి పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయని ధ్రువీకరించిన తర్వాత సంజీవని రెస్క్యూ హోంకు జూ అధికారులు తరలించారు. ఇటీవల పులి పిల్లకు జంతు సంరక్షకుడు ఆహారం పెట్టే సమయంలో దాని ముందు కాలు విరిగినట్టు గుర్తించారు. వెంటనే అధికారులు స్పందించి సమీపంలోని వెటర్నరీ కళాశాల నుంచి వైద్యులను రప్పించి విరిగిన కాలికి చికిత్స చేయించినట్లు తెలిసింది. ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురైన పులి పిల్ల.. మంగళవారం రాత్రి మృతి చెందింది. దీనిపై జూ అధికారులు పూర్తి వివరాలను వెల్లడించాల్సి ఉంది.