తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగానికి సంబంధించిన కేసులో నలుగురు నిందితుల విచారణకు కోర్టు విదించిన కస్టడీ గడువు ముగిసింది. సిట్ తాత్కాలిక కార్యాలయంలో విచారణ అనంతరం నిందితులను రుయా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తరువాత తిరుపతి రెండో అదనపు మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు.
ఉత్తరాఖండ్ కి చెందిన బోలేబాబా డెయిరీ మాజీ డైరెక్టర్లు పోమిల్ జైన్, విపిన్ జైన్, వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ వినయకాంత్ చావడా, తమిళనాడులోని ఏ.ఆర్. డెయిరీ ఎండీ రాజశేఖరన్ ను 5 రోజులుగా నెయ్యి కల్తీ ఘటనకు సంబంధించి సిట్ అధికారులు విచారించారు. నిందితులు విచారణకు సమకరించలేదని.. మరికొన్ని రోజులు కస్టడీ పొడగించాలని సిట్ కోరినట్టు సమాచారం. సోమవారం జరగాల్సిన నిందితుల బెయిల్ పిటిషన్ పై విచారణ బుధవారం జరుగనుంది.