తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన ఇవాళ.. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి కొలువుదీరి భక్తులకు కనువిందు చేస్తున్నారు. కల్పవృక్ష వాహనంపై స్వామి వారి వైభవాన్ని చూసి భక్తులు తన్మయత్వం పొందుతున్నారు. బ్రహ్మోత్సవాలతో తిరుమల వీధులన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. తిరుమాఢ వీధులన్నీ వేంకటేశ్వర నామ స్మరణతో.. గోవిందా.. గోవిందా నామాలతో మార్మోగుతోంది.
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. తిరుమలేశుడిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొని భక్తిపారవశ్యంతో పొంగిపోతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక కల్పవృక్ష వాహనంపై స్వామి వారి ఊరేగింపు తర్వాత.. ఆలయ అర్చకులు ఇవాళ రాత్రి సర్వభూపాల వాహన సేవ నిర్వహించనున్నారు.
మరోవైపు ఇవాళ తిరుమల శ్రీవారి టికెట్లు విడుదల కానున్నాయి. జనవరి నెల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన సేవల ఆన్‌లైన్ లక్కీడిప్ కోసం ఇవాళ ఉదయం 10 గంటల నుంచి.. 20న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని టీటీడీ సూచించింది.