తెలుగు సంవత్సరం ఉగాది పండుగను పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ ఉగాది ఆస్థానం నిర్వహిస్తున్నారు. ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని టీటీడీ సిబ్బంది సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి, విష్వక్సేనుల విశేష ఆభరణాలు సమర్పించారు. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉత్సవమూర్తులు ఆలయంలోకి ప్రవేశిస్తారు. అనంతరం గర్భాలయంలో స్వామివారికి, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలు సమర్పించనున్నారు. నూతన వస్త్రాలు సమర్పణ తర్వాత అర్చకులు పంచాంగ శ్రవణం చేయనున్నారు. ఉగాది ఆస్థానం సందర్భంగా టీటీడీ అధికారులు ఆర్జిత సేవలను రద్దు చేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
మరోవైపు తిరుమలలో టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వ దర్శనానికి 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. తిరుమల శ్రీవారిని సోమవారం రోజున 61,920 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి 17,638 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.55 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.