నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ ప్రారంభం కానుండగా.. ఈ భేటీలో దేవాదాయ భూముల ఆక్రమణలకు అడ్డుకట్ట వేసేలా చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఉమ్మడి జిల్లాలో జడ్పీ చైర్మన్ల పదవి కాలం పూర్తయ్యే వరకు కొత్త జిల్లాలకు కొనసాగించేలా చట్ట సవరణకు ఆమోదం తెలపనున్నారు.
అలాగే పంచాయతీ రాజ్ చట్టం లో సవరణలకు ఆమోదం తెలపనుంది మంత్రిమండలి. ఈ నెల 27న అమ్మఒడి పథకం నిధులు విడుదల చేసేందుకు ఆమోదిస్తారు. అలాగే పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇక 8వ తరగతి విద్యార్థులకు పంపిణీకి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇకపోతే 35 సంస్థలకు భూకేటాయింపులకు ఆమోదం తెలపనుంది ఏపీ ప్రభుత్వం. ఇక కృష్ణాజిల్లా మల్లవెల్లి పార్కులో రూ. 150 కోట్లతో అవిసా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పెట్టనున్న రొయ్యల ప్రాసెసింగ్ పరిశ్రమకు ఆమోదం తెలపనున్నారు.