మూడో తరగతి విద్యార్థులకు టోఫెల్ పరీక్షలు నిర్వహించనుంది జగన్ సర్కార్. అయితే, మూడవ తరగతి విద్యార్థుల నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరికి టోఫెల్ పరీక్షలు నిర్వహిస్తానని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. విదేశీ విద్య కోసం వెళ్ళే వారికి ఇంగ్లీష్ భాషపై ఎంత పరిజ్ఞానం ఉందో తెలుసుకోవడానికి ఈ పరీక్షను నిర్వహిస్తారని, రాష్ట్రంలో ఇంగ్లీషులో బోధించడానికి ఉపాధ్యాయులు లేరని, ఇంగ్లీష్ బోధించడానికి సైన్స్, హిస్టరీ బోధించే ఉపాధ్యాయులే దిక్కయ్యారని అన్నారు.
నాలుగు వేల కోట్ల రూపాయలు వెచ్చించి విద్యార్థులకు టోఫెల్ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు. దీనికి బదులు విదేశీ విద్య కోసం వెళ్లే వారికి ప్రభుత్వమే ఫీజులు చెల్లించి టోఫెల్ పరీక్షలను రాయడానికి సహకరిస్తే మంచిదని అన్నారు. జగనన్న విద్యా దీవెన, విద్యా వసతి కార్యక్రమాల పేరిట రాష్ట్రంలో విద్యా విధ్వంసం, విద్యా దోపిడీ కొనసాగుతున్నాయని, తొలుత సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశపెడతానని చెప్పి, సీబీఎస్ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు లేకపోవడంతో, ఇప్పుడు ఇంటర్నేషనల్ సిలబస్ ప్రవేశపెడతామని చెబుతున్నారని, దేశవ్యాప్తంగా 300 ఇంటర్నేషనల్ సిలబస్ పాఠశాలలు లేవని, కానీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏకంగా జగన్ మోహన్ రెడ్డి గారు 49 వేల పాఠశాలలలో ఇంటర్నేషనల్ సిలబస్ ప్రవేశపెడతానని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.