దేశవ్యాప్తంగా టమాట ధర మంట పెడుతోంది. ముఖ్యంగా సామాన్యులను టమాట మోత మోగిస్తోంది. రోజురోజుకు ధరలు పెరిగిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా ప్రాంతాల్లో టమాట ధర రూ.250 నుంచి రూ.300 వరకు చేరింది. ఇక ఏపీలోని అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె మార్కెట్‌లో టమాటా ధర రికార్డు మోత మోగింది. ఇవాళ కిలో నాణ్యమైన టమాటా రూ.196 పలికింది. అత్యల్పంగా కిలో రూ.140 ధరను నమోదు చేసింది. దీంతో వినియోగదారుల్లో గుబులు మొదలైంది.
మదనపల్లె మార్కెట్‌కు శనివారం కేవలం 253 టన్నుల సరకు మాత్రమే వచ్చిందని వ్యాపారులు తెలిపారు. బయట ప్రాంతాల్లో దిగుబడి లేకపోవడం, మదనపల్లె ప్రాంతంలో సీజన్ చివరి దశ కావడం వంటి కారణాలతో ధరలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయని వ్యాపారులు, అధికారులు చెబుతున్నారు. మదనపల్లె మార్కెట్‌లో మొదటి రకం కిలో టమాటా రూ. 160 – రూ. 196, రెండవ రకం రూ.120 – రూ.156 వరకు పలికింది.