మొన్నటి దాకా కిలో రూ.300.. ఇప్పుడేమో కనీసం రూ.3లకు కూడా అమ్ముడుపోవడం లేదు. ఉచితంగా ఇచ్చినా తీసుకునే వాళ్లు లేక రైతులు ఆ కూరగాయలను పారబోస్తున్నారు. దేని గురించి మాట్లాడుతున్నానో అర్థమైంది కదా. ఇంకా దేనిగురించి టమాట గురించే. మొన్నటిదాకా ఆకాశాన్నంటిన టమాట ధరలు ప్రస్తుతం భారీగా పతనమయ్యాయి. ముఖ్యంగా ఏపీలోని నంద్యాలలో టమాట ధరలు రూ.3కు పడిపోయాయి.
టమాట ధరలు భారీగా తగ్గడంతో రైతులు వాటిని రోడ్లపై పారబోస్తున్నారు. విక్రయించడానికి మార్కెట్లకు తీసుకెళ్తుంటే కనీసం రవాణా ఖర్చులు కూడా రావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డోన్ జాతీయ రహదారిపై టమాటాలను పారబోసిన రైతు.. వాటిని పశువులకు కూడా దాణాగా వేశారు. మరోవైపు ప్యాపిలి మార్కెట్‌లోనూ టమాటా ధరలు భారీగా పతనమయ్యాయి. ధరలు లేకపోవడంతో ఆరుబయటే పారేసి వెళ్లారు. రైతులు పారబోయిన టమాటాలను పశువులు తింటున్నాయి. గత నెల వరకు కిలో రూ.200 నుంచి రూ.300 వరకు కూడా పలికిన విషయం తెలిసిందే.