దేశంలోనే మొదటిసారిగా ట్రాన్స్ మీడియా ఎంటర్ టైన్ మెంట్ సిటీని ఏపీలో ఏర్పాటు చేయనున్నట్టు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ముంబైలో జరుగుతున్న వేవ్స్ సమ్మిట్ 2025లో ఏపీ ప్రభుత్వం.. క్రియేటివ్ ల్యాండ్ ఆసియా తమ సహకారాన్ని ప్రకటించినట్టు మంత్రి దుర్గేష్ వెల్లడించారు. ఈనెల 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు తొలిసారి ఇండియాలో ప్రత్యేకించి ముంబైలో జరుగుతున్న ప్రతిష్టాత్మక వేవ్స్ వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ సమ్మిట్ 2025లో ఈ మేరకు ఏపీ ప్రభుత్వం, క్రియేటివ్ ల్యాండ్ ఆసియా మధ్య ఎంవోయూ జరిగిందని తెలిపారు.
ఈ ఎంవోయూ ద్వారా ఏపీకి వచ్చే సందర్శకులు లీనమయ్యేలా థీమ్ పార్క్ లు, గేమింగ్ జోన్ లు, గ్లోబల్ సినిమా కో ప్రొడక్షన్ జోన్లు ఏర్పాటు కానున్నాయని వెల్లడించారు మంత్రి దుర్గేష్. అంతేకాదు.. ఉద్యోగ సృష్టి నైపుణ్య అభివృద్ధి పర్యాటకం డిజిటల్ ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఈ ఎంవోయూ దోహదం చేస్తుందని వివరించారు.