గర్భిణులకు మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త అందించింది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు పేద రోగులకు అడుగడుగునా అండగా నిలుస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని గారు పేర్కొన్నారు. గర్భిణులకు ఎంతో ముఖ్యమైన అల్ట్రా, టిఫా స్కానింగ్ లను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో… ఆ సేవలను అధికారికంగా శుక్రవారం నుంచి ప్రారంభించారు.
మంత్రి విడదల రజిని గారు చేతులమీదుగా ఆరోగ్యశ్రీ అమలవుతున్న గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా గర్భిణులకు అల్ట్రా, టిఫా స్కానింగ్ సేవలు పూర్తి ఉచితంగా అందబోతున్నాయి.
తొలుత మంత్రి గర్భిణులకు అల్ట్రా, టిఫా స్కానింగ్ సేవలను అధికారికంగా ప్రారంభించారు. మంత్రి విడదల రజిని గారు మాట్లాడుతూ ఈ రోజు నుంచి గర్భిణి స్త్రీలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో అల్ట్రా స్కానింగ్, టిఫా స్కానింగ్ సేవలు ఉచితంగా అందుతాయని చెప్పారు. ఎంతో ఖరీదైన ఈ సేవలను ఇప్పటివరకు రోగులు డబ్బులు చెల్లించి చేయించుకోవాల్సి ఉండేదని, ఇప్పుడు ప్రభుత్వమే ఈ ఖర్చు భరిస్తుందని తెలిపారు.