విజయవాడలోని కనకదుర్గమ్మ గుడి కార్యనిర్వహణాధికారిగా (ఈవో) కేఎస్ రామారావును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. తక్షణమే విధులు స్వీకరించాలని సర్కార్ ఆయనను ఆదేశించింది. ప్రస్తుతం శ్రీకాళహస్తి ఆర్డీవోగా పనిచేస్తున్నారు రామారావు. అయితే తొలుత ఈ నెల 1న దుర్గగుడి ఈవోగా వున్న భ్రమరాంబను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆమె స్థానంలో డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ అధికారి ఎం శ్రీనివాస్‌ను ఈవోగా నియమించింది. అయితే రోజులు గడుస్తున్నా ఆయన విధుల్లో చేరకపోవడంతో రామారావును ఈవోగా నియమిస్తూ ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సరిగ్గా శరన్నవరాత్రులకు కొద్దిరోజుల ముందు ఈవో భ్రమరాంబ బదిలీ వ్యవహారం విజయవాడతో పాటు దేవాదాయ శాఖలో చర్చనీయాంశమైంది. గత కొంతకాలంగా దుర్గగుడి ఈవో భ్రమరాంబకి, ఆలయ పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబుకు మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈ బదిలీ వెనుక రాజకీయ కోణం వున్నట్లుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబవుతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు, పాలకమండలి సభ్యులు సమీక్షించారు.