పేద ప్రజల ఆరోగ్య భద్రత, ఆరోగ్య ఆంధ్రప్రదేశే లక్ష్యంగా వైద్య రంగంలో సంస్కరణలు చేపట్టామని, వైద్య సేవలను విస్తరించామని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని గారు పేర్కొన్నారు. దానిలో భాగంగానే ఆధునిక వసతులతో కూడిన ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఫ్యామిలీ డాక్టర్ విధానం, జగనన్న ఆరోగ్య సురక్ష పథకం అందుబాటులోకి వచ్చాయని గుర్తు చేశారు. ఆరోగ్య శ్రీ పథకంలో వెయ్యి వరకు ఉన్న సేవలను మూడు వేల వరకు పెంచామని చెప్పారు.
ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పేదల ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలందించేందుకు గాను విశాఖపట్టణం కేజీహెచ్‌లోని సుమారు రూ.21.92 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆమె శనివారం ప్రారంభించారు.కార్యక్రమంలో భాగంగా ముందుగా కార్డియాలజీ విభాగంలో రూ.24 లక్షల సీఎస్ఆర్ నిధులతో ఆధునికీకరించిన ఐసీసీయు, ఎంసీయూ యూనిట్లను ప్రారంభించారు. అనంతరం కార్డియాలజీ విభాగంలో చికిత్స పొందుతున్న రోగులతో ఆమె ఆప్యాయంగా మాట్లాడారు.
అందుతున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. అక్కడ నుంచి ఎం.ఆర్.ఐ., సిటీ స్కానింగ్ సెంటర్ వరకు కాలినడక చేరుకున్న మంత్రి రూ.11.25 కోట్లతో ఏర్పాటు చేసిన ఎం.ఆర్.ఐ., రూ.3.82 కోట్లతో ఏర్పాటు చేసిన సీటీ స్కానింగ్ యూనిట్లను ప్రారంభించి అందుబాటులోకి తీసుకొచ్చారు. అనంతరం రూ.2.38 కోట్లతో సమకూర్చిన ఆధునిక వసతులతో కూడిన తొమ్మిది అంబులెన్స్‌లను జెండా ఊపి ప్రారంభించారు. అక్కడ నుంచి స్కిల్ ల్యాబ్‌కు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన పరికరాలను మంత్రి గారు పరిశీలించారు.