కాంగ్రెస్ పార్టీ ప్రధానులపై విజయసాయిరెడ్డి వివాదాస్పద పోస్ట్ చేశారు. దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ జీ 2023 మే 30న 9 సంవత్సరాలు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా ఇప్పటి వరకూ ఈ పదవిలో ఉన్న ప్రముఖుల ప్రత్యేకతల గురించి రాజకీయ పండితులు ప్రస్తావిస్తున్నారన్నారు.
భారతదేశంలో అత్యంత శక్తిమంతమైన కార్యనిర్వాహక అధికారం ఉన్న ప్రధాని పదవిని 1947 ఆగస్ట్ 15 నుంచి ఇప్పటి వరకూ 15 మంది నాయకులు చేపట్టారు. ఈ పదిహేను మందిలో ఒకరైన కాంగ్రెస్ నేత గుల్జారీలాల్ నందా దేశ తొలి ప్రధాని పండిత జవహర్లాల్ నెహ్రూ, మరో కాంగ్రెస్ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రీ మరణానంతరం 13 రోజులు చొప్పున రెండుసార్లు ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. కాంగ్రెస్ పార్టీ కొత్త పార్లమెంటరీ పార్టీ నేతను ఎన్నుకునే వరకూ ఆయన ప్రధాని పదవిలో ఇలా దాదాపు రెండేసి వారాల చొప్పున రెండుసార్లు ఉన్నారు. భారత రాజ్యాంగంలో ‘తాత్కాలిక ప్రధాని’ అనే పదవి లేకున్నా నందా జీ ని రాజకీయ పరిశీలకులు, పాత్రికేయులు తాత్కాలిక ప్రధాని అనే ప్రస్తావిస్తారని వెల్లడించారు.
నందాను ప్రధాని పదవి చేపట్టిన వారి జాబితా నుంచి తొలగించి చూస్తే–మొత్తం 14 మందిని ఈ ఉన్నత పదవి వరించిందని భావించాలి. అనేక పార్టీలకు చెందిన ఈ పద్నాలుగు మందిలో ఆరుగురు–జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాధీ, పి.వి.నరసింహారావు, డా.మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. మిగిలిన ఎనిమిది మందిలో ఆరుగురు వరుసగా (మొరార్జీదేశాయి, చరణ్ సింగ్, వి.పి.సింగ్, చంద్రశేఖర్, హెచ్.డి.దేవెగౌడ, ఐ.కె.గుజ్రాల్) జనతా అనే పేరుతో ఉన్న జనతా పార్టీ, జనతా–ఎస్, జనతాదళ్, సమాజ్ వాదీ జనతా (ఎస్) అనే పార్టీకు చెందిన నేతలు. పేరుకు కాంగ్రెసేతర ప్రధానులేగాని ఈ ఆరుగురూ కాంగ్రెస్ మూలాలున్న నేతలే! అన్నారు విజయసాయి రెడ్డి.